STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 1:57 pm Posted by : ARUN

Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్‌

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ , ఈడీ విచారణ చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తూ తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన కూడా ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. పిటిషన్‌లోని అంశాలను మరోసారి పరిశీలించాలని, ముఖ్యంగా ఫిర్యాదుదారుడు దాఖలు చేసిన పిటిషన్ చట్టపరంగా విచారణకు అర్హమైనదేనా? అనే విషయాన్ని తేల్చాలని హైకోర్టుకు సూచించింది. అంతేకాకుండా రాహుల్ గాంధీని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చి, ఆయన వాదనలు విన్న తర్వాతే తదుపరి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఈ కేసు కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేశ్ శిశిర్ దాఖలు చేసిన ఫిర్యాదుతో మొదలైంది. రాహుల్ గాంధీకి తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా విచారణ జరపాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై మే 2026లో విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. ఆరోపణలను చట్టప్రకారం పరిశీలించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అనంతరం దర్యాప్తు పురోగతిపై వివరాలు కోరింది. జూలై 20న సీబీఐ సమర్పించిన అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరింత స్పష్టమైన నివేదిక ఇవ్వాలని సూచించింది.

ఈ పరిణామాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు విచారణను నిలిపివేయడంతో పాటు దర్యాప్తు సంస్థలు నివేదికలు సమర్పించకుండా మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కనపెట్టి కొత్తగా విచారణ జరపాలని ఆదేశించడంతో రాహుల్‌కు ఊరట లభించింది.