STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 3:19 pm Posted by : ARUN

Kavitha: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే పోటీ.. కరువు నివారణలో రేవంత్‌ విఫలం

నిజామాబాద్: తెలంగాణలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎన్నికల్లో గెలవాలనే ఆరాటమే తప్ప ప్రజల సంక్షేమంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాదని, తన రాజకీయ ప్రయోజనాల కోసమేనని కవిత విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో 15 మండలాలను, కామారెడ్డి జిల్లాలో కేవలం నాలుగు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తగిన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ఎంతమేర నిధులు, సహాయం తీసుకొచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల గడువు ముగిసిన నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నుంచి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు కీలక పదవుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని విమర్శించారు.

ప్రజలకు కనీసం మంచినీటి సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వాలు మూసీ ప్రాజెక్టుకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని కవిత ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా పూర్తిస్థాయిలో దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని ఆరోపించారు.

జల వివాదాల పేరుతో కాలయాపన చేయకుండా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారుతున్నా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, తెలంగాణలో మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

ప్రజలు తమ సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే పరిష్కారాలు లభిస్తాయని కవిత పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంగా వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచే పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. దీంతో కవిత రాజకీయంగా నిజామాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు స్పష్టమవుతోంది.