ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలగనున్నారు. కంపెనీలో 11 ఏళ్లకు పైగా పనిచేసిన అనంతరం తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ బుధవారం ప్రకటించింది. ఆయన స్థానంలో కొత్త సీఈఓను రానున్న కొన్ని వారాల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
కల్యాణ్ కృష్ణమూర్తి వైదొలగే నేపథ్యంలో తాత్కాలికంగా సంస్థ నిర్వహణ బాధ్యతలను చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, ఫ్లిప్‌కార్ట్ బోర్డు చేపట్టనున్నాయి. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు వీరు సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.
కల్యాణ్ కృష్ణమూర్తి 2016లో తిరిగి ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. అంతకుముందు సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం 2017 జనవరిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. 2018 నుంచి గ్రూప్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం ఐదు రెట్లకు పైగా వృద్ధి సాధించిందని కంపెనీ వెల్లడించింది. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా ఎదగడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆయన హయాంలోనే ఫ్లిప్‌కార్ట్ తన వ్యాపార కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించింది. వినియోగదారులు, విక్రేతలకు అనేక కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా సంస్థ నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ దేశంలో అతిపెద్ద పండుగల షాపింగ్ ఈవెంట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ సందర్భంగా కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ప్రయాణంలో భాగస్వామి కావడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. సంస్థ సాధించిన వృద్ధితో పాటు, నైతిక విలువలు, నిజాయితీ, మెరుగైన పాలనా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ ఉద్యోగులు, విక్రేతలు, భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.
2007లో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం 50 కోట్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులు, 14 లక్షలకు పైగా విక్రేతలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మింత్రా, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, క్లియర్‌ట్రిప్, సూపర్.మనీ వంటి సంస్థలు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగంగా ఉన్నాయి. ఆయన స్థానంలో ఎవరు బాధ్యతలు చేపడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.