STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 1:13 pm Posted by : ARUN

Kodangal: వికలాంగుల హక్కుల కోసం కోస్గీ నుండి కొడంగల్ వరకు పాదయాత్ర

కొడంగల్: వికలాంగుల హక్కుల సాధన కోసం కోస్గీ నుండి కొడంగల్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వికలాంగులకు నెలకు రూ. 6 వేల పెన్షన్ అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో పాటు వృద్ధులు, గీత కార్మికులు, వితంతువుల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ప్రకటించిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయడం వంటి కీలక హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ‘అభయహస్తం’ మేనిఫెస్టోలోని 29వ అంశంలో పేర్కొన్న విషయాన్ని వారు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడం విచారకరమన్నారు. వికలాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వీడి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.