STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 2:49 pm Posted by : ARUN

Sabarimala: శబరిమల యాత్రికుల గుండెకు భద్రత.. కేరళ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు!

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు ఏటా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివెళ్తుంటారు. అయితే కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవడానికి భక్తులు చేపట్టే కఠినమైన నడక, ముఖ్యంగా పంబ నుంచి సన్నిధానం వరకు ఉండే ఎత్తైన మెట్ల మార్గం ఆరోగ్యపరంగా సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2026-27 మండల-మకరవిళక్కు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేరళ ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్న భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరే ముందు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించింది. కొండ ఎక్కే సమయంలో శరీరంపై అతిగా ఒత్తిడి తెచ్చుకోవద్దని హెచ్చరించింది. భోజనం చేయకుండా ప్రయాణం ప్రారంభించడం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసటను పట్టించుకోకుండా నడవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది.

నవంబర్ 22న కేరళ ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొన్న భక్తులు యాత్రకు వెళ్లే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల అనుమతి తీసుకున్న తర్వాతే కొండపైకి వెళ్లాలి. ఇటీవల గుండెపోటుకు గురైనవారు, గుండె శస్త్రచికిత్స లేదా యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారు  ,గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) సమస్యతో బాధపడుతున్నవారు నిపుణుల సలహా లేకుండా కఠినమైన కొండ ప్రయాణం చేయకూడదని స్పష్టం చేసింది.

భక్తులు తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాత్ర చేపట్టాలని ఆరోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. యాత్ర సమయంలో సరిపడా మందులను, వాటికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను వెంట తీసుకెళ్లాలి.

కొండ ఎక్కేటప్పుడు ఇతరులతో పోటీపడకుండా తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా నడవాలి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. అధిక శ్రమకు గురికాకూడదు. వైద్యులు నీటిని పరిమితంగా తీసుకోవాలని సూచించనట్లయితే తగినంత నీరు తాగాలి. ఖాళీ కడుపుతో కొండ ఎక్కడం ప్రారంభించకూడదు. పరుగెత్తడం, రద్దీలో తోపులాటకు దిగడం వంటి చర్యలను నివారించాలని సూచించింది.

ముఖ్యంగా గుండె వైఫల్యంతో బాధపడుతున్నవారు నీటిని ఎక్కువగా తాగాలనే సాధారణ సూచనను యథాతథంగా పాటించకూడదని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అలాంటి వారికి వైద్యులు ద్రవ పదార్థాలపై పరిమితులు విధించి ఉంటే తప్పనిసరిగా వారి సూచనలనే అనుసరించాలని స్పష్టం చేసింది.

శబరిమల యాత్రలో నడుస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, అసాధారణమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే నడక ఆపి సురక్షితమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. సమీపంలోని అత్యవసర వైద్య కేంద్రాన్ని సంప్రదించాలి.

లక్షణాలు తగ్గిపోతాయని భావించి యాత్రను కొనసాగించడం లేదా ఎలాగైనా కొండపైకి చేరుకోవాలని ప్రయత్నించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారే కాకుండా అన్ని వయసుల భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకుని యాత్రకు సిద్ధం కావాలని కేరళ ఆరోగ్యశాఖ సూచిస్తోంది.