STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 1:59 pm Posted by : ARUN

Nepal PM: నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ఘన స్వాగతం.. మోదీతో కీలక భేటీ!

నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా భారత పర్యటనలో భాగంగా సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక స్వాగత కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలేంద్ర షాకు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన భారత్‌కు వచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది.

బాలేంద్ర షా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో భారత్‌-నేపాల్ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రవాణా, మౌలిక సదుపాయాలు, విద్యుత్, జలవిద్యుత్ రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలు, విపత్తు నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

బాలేంద్ర షా తన భారత పర్యటనలో భాగంగా ఆదివారం విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌-నేపాల్ సంబంధాలు, సరిహద్దు కనెక్టివిటీ, వాణిజ్యం, రవాణా, ఇంధనం, సంస్కృతి, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు ప్రస్తావించారు.

భారత్‌కు, నేపాల్‌కు మధ్య ప్రత్యేకమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బాలేంద్ర షా సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

2026 మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేస్తున్న తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన కూడా ఇదే కావడం విశేషం.