వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని మరో 500 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలోని కేడీసీ గ్రౌండ్లో నిర్వహించిన జన చైతన్య సభలో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి తన అనుచరులు, వివిధ రంగాలకు చెందిన మేధావులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అవినీతికి చిరునామాగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారని విమర్శించారు. పనులు కావాలంటే 20 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందని మరో ఎమ్మెల్యే చెబుతున్నారని అన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సోదరులపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. ప్రజాపాలన కంటే పర్సంటేజీల పాలనే ఎక్కువగా కనిపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు.
వరంగల్ అభివృద్ధిపై కేటీఆర్ హామీ
బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ గుర్తుచేశారు. నేత కార్మికులు ఉపాధి కోసం భివండి, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లకుండా దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు. కిటెక్స్, గణేశా ఎకోస్పియర్, యంగ్ వన్ వంటి పరిశ్రమలను తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు రూ.150 కోట్లతో రెండు సమీకృత కలెక్టరేట్లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
అయితే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక్క కొత్త ఐటీ కంపెనీని, ఒక్క కొత్త టెక్స్టైల్ పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఉన్న పరిశ్రమలు సైతం మూతపడుతున్నాయని ఆరోపించారు. 90 శాతం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మిగిలిన 10 శాతం పనులను కూడా మూడేళ్లలో పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేయకుండా ప్రైవేట్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
మహిళలకు ఇచ్చిన హామీలపై నిలదీత
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కనీసం లక్షాధికారులుగా చేసినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి 36 నెలలు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ లెక్కన ఒక్కో మహిళకు రూ.85,500 బకాయి పడ్డారని, వచ్చే రెండేళ్ల హామీలను కలిపి ఒక్కో మహిళకు రూ.1.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 4.71 లక్షల ఆసరా పెన్షన్లకు కోత పెట్టి, 4.63 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఫ్యూచర్ సిటీ కాదు.. ఫ్యూచర్ ఉన్న వరంగల్‌పై దృష్టి పెట్టాలి
ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రచారం చేసుకోవడం కాదని, భవిష్యత్తు అవకాశాలు పుష్కలంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. ఫార్మా సిటీ పేరును మార్చి ఫ్యూచర్ సిటీగా ప్రచారం చేసుకోవడం అభివృద్ధి కాదన్నారు. వరంగల్‌ను భవిష్యత్తులో ప్రధాన ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 500 రోజులే మిగిలి ఉన్నాయని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అచ్చ విద్యాసాగర్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
మరోవైపు దివంగత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అచ్చ విద్యాసాగర్ కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ కోసం అచ్చ విద్యాసాగర్ చేసిన సేవలు, త్యాగాలను ఎప్పటికీ మరువబోమని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.