STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 2:35 pm Posted by : ARUN

Jagadish Reddy: డిసెంబర్ 10న ‘నల్గొండ నగారా’..సాగర్ జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట

నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 10వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. నల్గొండ నగారా పేరుతో రైతులతో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇదే అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకుల బృందం జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) చైర్మన్‌ను కలిసింది. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదు చేసింది. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సాగర్ వద్ద జలదోపిడీకి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీ అధికారులను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రోజుకు సుమారు 10 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణలో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

మరో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించేందుకు నిర్మాణ పనులు ప్రారంభించిందని ఆరోపించారు. ఈ పనుల గురించి కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కేఆర్ఎంబీ అధికారులకు లేఖ అందజేసినట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి తన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగించుకుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నీటిని ఏపీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శించారు. ఈ పరిణామాలతో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని సుమారు రెండున్నర కోట్ల మంది ప్రజలకు తాగునీరు, సాగునీటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

నాగార్జున సాగర్ జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రైతులను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు డిసెంబర్ 10న నిర్వహించనున్న నల్గొండ నగారా సభను బీఆర్ఎస్ కీలకంగా భావిస్తోంది.