STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 10:41 am Posted by : ARUN

Iran-US War: అమెరికా రాడార్లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి!

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది. ఈ పరిణామం గల్ఫ్ ప్రాంతంలో మరోసారి యుద్ధ భయాలను పెంచుతోంది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా IRIB ప్రసారం చేసిన ప్రకటన ప్రకారం.. ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ బహ్రెయిన్‌లోని అల్ రిఫా , అవాలి సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులు, డ్రోన్లతో సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది.

ఈ రెండు స్థావరాల్లో ఏర్పాటు చేసిన అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు చెందిన రాడార్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టంపై అమెరికా నుంచి స్వతంత్రంగా ధ్రువీకరణ అందుబాటులో లేదు.

తమ గగనతలంలోకి అమెరికాకు చెందిన ఎంక్యూ-1 , ఎంక్యూ-9 నిఘా, యుద్ధ డ్రోన్లు పదేపదే చొరబడుతున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఇరాన్‌లోని హెంగామ్ ద్వీపంలో ఉన్న రాడార్ కేంద్రంపై అమెరికా దాడి చేసిందని పేర్కొంది. ఈ పరిణామాలకు ప్రతీకారంగానే బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.

ఇరాన్ గగనతలం తమ సాయుధ దళాలకు రెడ్ లైన్ అని స్పష్టం చేసింది.  హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9, ఎంక్యూ-1 డ్రోన్లను కూల్చివేసినట్లు చూపించే వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. అలాగే బహ్రెయిన్‌లోని పేట్రియాట్ రాడార్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు పేర్కొంటూ మరో వీడియోను ప్రసారం చేసింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ తమ సైనిక పరికరాలకు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో.. ఇరాన్ విడుదల చేసిన వీడియోలు మరోసారి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. బహ్రెయిన్‌లోని ఓ పౌర పారిశ్రామిక కేంద్రంపై ఇరాన్ దాడి జరిగినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించిందని, అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.బహ్రెయిన్ రక్షణ దళాలు కూడా శనివారం రాత్రి పలు ఇరాన్ వైమానిక దాడులను తమ రక్షణ వ్యవస్థలతో అడ్డుకున్నట్లు ప్రకటించాయి.

బహ్రెయిన్‌లో అమెరికా నావికాదళానికి చెందిన ఐదో ఫ్లీట్ ప్రధాన స్థావరం ఉండటం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడుల ప్రకటనలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, తాజా పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.