భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 2026 వర్షాకాల సమావేశాలు ముగిసి 100 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ అధికారికంగా ముగింపు (ప్రోరోగేషన్) ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రోరోగ్ కాని సమావేశాలుగా ఇవి సరికొత్త రికార్డు సృష్టించాయి.
ఆగస్టు 13న లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే శనివారం ఉదయం నాటికి ఈ రెండు సభలను అధికారికంగా ప్రోరోగ్ చేయలేదు. గతంలో 2008లో పార్లమెంట్ సమావేశాలు 87 రోజుల పాటు ప్రోరోగ్ కాకుండా కొనసాగాయి. ఇప్పుడు ఆ రికార్డును 2026 వర్షాకాల సమావేశాలు అధిగమించాయి.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేదా పొడిగించిన సమావేశాలను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే ఈ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి? ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాలను గరిష్ఠంగా 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న స్థానాల నిష్పత్తిని కొనసాగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుత సమావేశాలనే పొడిగించి నిర్వహించాలంటే కనీసం రెండు రోజుల ముందస్తు నోటీసు అవసరం. కొత్త సమావేశాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. సభలను నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత ఎంత వ్యవధిలో ప్రోరోగ్ చేయాలనే దానిపై రాజ్యాంగంలో నిర్దిష్ట గడువు లేదు. కాబట్టి సమావేశాలు ఇంతకాలం అధికారికంగా ముగియకపోవడం మాత్రమే రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించలేమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.