STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 4:18 pm Posted by : ARUN

Kavitha: సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ.. సాగర్ డ్యామ్ ను ముట్టడిస్తాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ జలవనరులపై కన్నేసిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబును ప్రజాభవన్‌కు ఆహ్వానించి కాళ్లు కడిగి గురుదక్షిణగా తెలంగాణ నీళ్లను అప్పగించారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్‌పై అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారం రోజుల్లోగా ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలని, లేనిపక్షంలో వేలాది మందితో నాగార్జున సాగర్ డ్యామ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా అంగీకారం తెలిపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను విస్మరిస్తున్నారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేయాల్సిన రేవంత్ రెడ్డి.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో అనధికారిక సమావేశానికి వెళ్లి వచ్చారని, ఈ వ్యవహారం తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఉందని అన్నారు.

తాగునీటి అవసరాల పేరుతో ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. ఇప్పటికే తాగునీటి అవసరాల కోసం 2.8 టీఎంసీల నీటిని తీసుకుంటున్న ఏపీ.. ఇప్పుడు లిఫ్ట్ ప్రాజెక్టు పేరుతో మరో 1.8 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతోందని పేర్కొన్నారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి తాగునీటి పేరుతో భారీగా నీటిని తరలించారని గుర్తుచేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్‌పైనా అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా అక్రమ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలియకపోవడం ఎలా సాధ్యమని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారని, అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఈ ప్రాజెక్టు సమాచారం అందలేదా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమా? లేక ముఖ్యమంత్రి వైఫల్యమా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి సమ్మతితోనే ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఆరోపించారు.

మరోవైపు తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మౌనం వహించడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఓట్లు, సీట్లు మాత్రమే బీజేపీకి కావాలా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నించారు. ఎంపీ రఘునందన్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏపీ అక్రమ ప్రాజెక్టుపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉందని తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు.

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఏపీ అక్రమ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేయాలని కవిత కోరారు. జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు అందించడం దారుణమని, వెంటనే ఆ ఆర్థిక సహాయాన్ని నిలిపివేయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఏపీ అక్రమంగా చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిలిపివేయించే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఉందని కవిత స్పష్టం చేశారు. ఇందుకు వారం రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. ఈలోగా ప్రాజెక్టు పనులు నిలిపివేయించకపోతే తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వేలాది మంది ప్రజలతో నాగార్జున సాగర్ డ్యామ్‌ను ముట్టడిస్తామని, అప్పుడు తలెత్తే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కవిత హెచ్చరించారు.