STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:47 pm Posted by : ARUN

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్!

తెలంగాణలో నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది హోంగార్డులను నియమించేందుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశంలో హోంగార్డుల నియామక అంశంపై చర్చించారు. త్వరలోనే నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

రాష్ట్ర పోలీస్ శాఖలో సిబ్బంది అవసరాలు, పరిపాలనా సంస్కరణలు, సిబ్బంది సంక్షేమం తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 2 వేల హోంగార్డుల నియామకంపై అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్, ఇతర విధివిధానాలపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం.

పోలీస్ శాఖలో మరిన్ని సంస్కరణలు

హోంగార్డుల నియామకాలతో పాటు పోలీస్ శాఖలో పలు కీలక మార్పులు తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్త తెలంగాణ పోలీస్ మాన్యువల్ విడుదలకు సంబంధించిన అంశాన్ని కూడా సమీక్షించారు. వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్ నిర్వహణ, మహిళా పోలీసు అధికారుల సదస్సు ఏర్పాట్లపైనా చర్చించారు.

పోలీస్ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించేందుకు వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపొందించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణ, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లు, పోలీస్ శాఖకు చెందిన బ్రాస్, పైప్ బ్యాండ్ల పునరుద్ధరణపై కూడా చర్చ జరిగింది.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు నిర్దిష్ట గడువులు విధించారు. అయితే 2 వేల హోంగార్డుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల తేదీలు, ఎంపిక విధానంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.