STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 1:26 pm Posted by : ARUN

Telangana: ఇకపై తెలంగాణలో ‘చెత్త’ పన్ను..!! 100 మందికి మించి దావత్‌ చేస్తే!

తెలంగాణలో చెత్త నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై భారీ వేడుకలు, దావత్‌లు నిర్వహించే వారు ఉత్పత్తయ్యే చెత్తకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 100 మందికి మించి అతిథులతో వేడుకలు నిర్వహిస్తే ముందస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ఆ కార్యక్రమంలో ఉత్పత్తయ్యే చెత్తకు కిలోకు రూ.3 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన ఆదేశాలు జారీ చేశారు.

సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు, ఇతర ఫంక్షన్లలో పెద్ద మొత్తంలో చెత్త ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసుల కారణంగా పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెత్త నియంత్రణ, సమర్థవంతమైన నిర్వహణ లక్ష్యంగా కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త నిబంధనల ప్రకారం 100 మందికి మించి అతిథులు హాజరయ్యే వేడుకలు, దావత్‌లు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కార్యక్రమం ద్వారా ఎంత చెత్త ఉత్పత్తి అవుతుందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.

వేడుకల్లో ఉత్పత్తయ్యే చెత్తను కిలోకు రూ.3 చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంటే కార్యక్రమంలో 100 కిలోల చెత్త ఉత్పత్తి అయితే రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా సరైన పద్ధతిలో సేకరించి నిర్వహించేలా ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త నిబంధనలతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర భారీ కార్యక్రమాలు నిర్వహించే వారిపై అదనపు ఆర్థిక భారం పడనుంది. మరోవైపు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడటంతో పాటు చెత్తను బాధ్యతాయుతంగా నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలు ఎలా అమలవుతాయి? అనుమతుల ప్రక్రియ, చెత్త బరువు నిర్ధారణ ఎలా ఉంటుంది? అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.