STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 3:48 pm Posted by : ARUN

AP Politics: ఒకే కుటుంబంలో మూడు పదవులు.. భార్య ఎమ్మెల్యే, భర్త జెడ్పీటీసీ, తల్లి ఎంపీపీ!

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూడు కీలక పదవులను దక్కించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కుటుంబంలోనే ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు ఉండటం విశేషంగా నిలిచింది. శిరీషాదేవి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. ఆమె భర్త విజయభాస్కర్ జెడ్పీటీసీగా, తల్లి కృష్ణవేణి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో కృష్ణవేణి రాజవొమ్మంగి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె తంటికొండ ఎంపీటీసీగా విజయం సాధించారు. అనంతరం ఎంపీపీ పదవిని దక్కించుకోవడంతో కుటుంబంలో మరో కీలక రాజకీయ పదవి చేరింది. మరోవైపు ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త విజయభాస్కర్ కూడా జడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వేర్వేరు స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మిరియాల శిరీషాదేవి రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరమే. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసిన ఆమె రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరఫున 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సామాన్య ఉద్యోగ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగిన ఆమె ప్రయాణం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ఆమె భర్త, తల్లి కూడా స్థానిక సంస్థల్లో కీలక పదవులు దక్కించుకోవడంతో ఈ కుటుంబం పోలవరం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలిచింది. ఒకే ఇంట్లో మూడు ప్రజాప్రతినిధి పదవులు ఉండటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది