STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 1:19 pm Posted by : ARUN

Alia Bhatt: రణబీర్‌తో పెళ్లిపై విమర్శలు.. అలియా భట్ తీవ్ర అసహనం!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్….నటుడు రణబీర్ కపూర్ వైవాహిక జీవితంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించారు. తమ వివాహ బంధాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం తనను బాధిస్తోందని ఆమె అన్నారు. ముఖ్యంగా తమది అసమానమైన వివాహ బంధం అంటూ జరుగుతున్న ప్రచారంపై అలియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

2022లో అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది నవంబర్‌లో వీరికి కుమార్తె రాహా జన్మించింది. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరూ ఒకరి గురించి మరొకరు చేసే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కొందరు విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ వస్తున్నారు.

తమ వివాహ బంధం గురించి వస్తున్న ఊహాగానాలను ఆమె ఖండించారు. మహిళలు తమ ఆలోచనలు, మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని అలియా అన్నారు. అలాంటి తనను ఒక అసంతృప్తికరమైన వైవాహిక జీవితంలో ఉన్న మహిళగా చిత్రీకరించడం బాధాకరమని పేర్కొన్నారు.

ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఉండటం, మనం ఏమీ చెప్పకపోయినా మన మాటలను వినగలగడం ఏ బంధానికైనా పునాది. రణబీర్ విషయంలో నాకు అలాంటి అనుభూతే ఉంటుంది. మా బంధంలో వాస్తవం ఇదే అని అలియా స్పష్టం చేశారు. రణబీర్‌ను తాను ఎక్కువగా ఆటపట్టిస్తుంటానని అలాగే రణబీర్ కూడా తనను ఆటపట్టించడానికి ఇష్టపడతాడని వెల్లడించారు. ఇద్దరి మధ్య ఇలాంటి సరదా వాతావరణం సహజంగానే ఉంటుందని వివరించారు.