కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్పు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ప్రాజెక్టుల పేర్లు మార్చాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చితే.. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న అన్ని సంస్థలు, ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల పేర్లను మారుస్తామని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు, ఉప్పల్ స్టేడియం పేర్లను కూడా మారుస్తామని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం అనేది రాజకీయ నాయకుడి పేరు కాదని, ప్రాజెక్టులకు కేసీఆర్ తన పేరు పెట్టుకోలేదని గుర్తుచేశారు. లక్ష్మీ, పార్వతీ, సరస్వతి, సమ్మక్క, సీతమ్మ, రంగనాయక, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వంటి దేవుళ్లు, దేవతల పేర్లను ప్రాజెక్టులకు పెట్టారని వివరించారు. అలాంటి ప్రాజెక్టు పేరును రాజకీయ కక్షతో మార్చాలనుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడైన పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీని ఏర్పాటు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడంతో పాటు, పక్కనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు, పథకాల పేర్లు మార్చడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో అన్నపూర్ణ క్యాంటీన్లుగా ఉన్న వాటికి ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చినంత మాత్రాన ప్రజలకు కలిగిన మేలు ఏమిటని నిలదీశారు. పేర్ల మార్పుపై పెట్టే శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
జైపాల్ రెడ్డి పేరు మీద జిల్లా ఏర్పాటు చేస్తామని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా ఆయన పేరు పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించినంతగా మరెవరూ విమర్శించలేదని అన్నారు. ఇప్పుడు అదే నాయకుడి పేరును ప్రాజెక్టులకు, జిల్లాలకు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్‌పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చితే, భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న అన్ని నిర్మాణాలు, సంస్థల పేర్లను మారుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఉప్పల్ స్టేడియం వరకు కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న వాటిని కూడా మార్చుతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకుండా పేర్ల మార్పుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు.