STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 5:23 pm Posted by : ARUN

Trump: ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు.. మోదీ చాలా కఠినమైన వ్యక్తి అంటూ కితాబు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఆసియాన్ (ASEAN) సదస్సు సందర్భంగా క్వాడ్ (QUAD) దేశాల నేతలు మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని కఠినమైన వ్యక్తి , గొప్ప నాయకుడు అంటూ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గౌరవం ఉందని పేర్కొన్నారు.

క్వాడ్ దేశాల నేతలతో కలిసి గ్రూప్ ఫొటో దిగే సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని సనే తకైచీని కూడా ప్రస్తావిస్తూ.. ఆమె అంతకంటే కఠినమైన నాయకురాలు కావచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. క్వాడ్‌లోని నేతలందరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారంతా తన స్నేహితులని, అద్భుతమైన వ్యక్తులని ట్రంప్ పేర్కొన్నారు.

అనంతరం క్వాడ్ నేతలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. గత కొన్నేళ్లుగా ఈ కూటమి దేశాల మధ్య సహకారం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాల్లో క్వాడ్ ఒకటని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛగా, బహిరంగంగా, స్థిరంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

స్వేచ్ఛాయుత, బహిరంగ, స్థిరమైన, అత్యంత సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మన నాలుగు దేశాలు నాలుగు మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రాంతీయ భద్రత, ఆర్థిక దౌత్యానికి సంబంధించిన అంశాల్లో మన దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. పరస్పరం సమన్వయంతో పనిచేస్తున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ కూటమిని నిర్మాణాత్మకమైన, విశ్వసనీయమైన భాగస్వామ్యంగా అభివర్ణించారు. సముద్ర భద్రత, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కీలక అంశాల్లో క్వాడ్ ఎప్పుడూ విశ్వసనీయ పరిష్కారాలను అందిస్తోందని చెప్పారు. క్వాడ్ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఈ కూటమి దేశాల మధ్య శతాబ్దాల నాటి ప్రత్యేక బంధం ఉందని పేర్కొన్నారు.