STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 3:34 pm Posted by : ARUN

Jyotirlingas: దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలు.. విశిష్టత!

దేశంలోని ప్రముఖ 12 జ్యోతిర్లింగాలు పరమశివుడి అనంతమైన దివ్య కాంతికి, విశ్వవ్యాప్తమైన పరమశక్తికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ పవిత్ర క్షేత్రాలు భక్తులకు శివుడి ఆశీస్సులు అందించడంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం, మనశ్శాంతి, మోక్ష సాధనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. శివపురాణం ప్రకారం.. ఈ పవిత్ర క్షేత్రాల్లో పరమశివుడు అనంతమైన దివ్య కాంతితో కూడిన జ్యోతిస్థంభంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ క్షేత్రాలను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు.

()సోమనాథ్ జ్యోతిర్లింగం – గుజరాత్

12 జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ క్షేత్రం. గుజరాత్ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఈ ఆలయం ఉంది. భూమిపై మొదట ఆవిర్భవించిన జ్యోతిర్లింగం ఇదేనని భక్తుల విశ్వాసం. అనేక దండయాత్రల కారణంగా ఈ ఆలయం పలుమార్లు ధ్వంసమైనప్పటికీ తిరిగి పునర్నిర్మించారు. ఈ ఆలయం విశ్వాసానికి, పట్టుదలకు, శివభక్తికి ప్రతీకగా నిలుస్తోంది.

() మల్లికార్జున జ్యోతిర్లింగం – శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్

రెండో జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం పర్వత ప్రాంతంలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. ఇక్కడ పరమశివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువై ఉన్నారు. చుట్టూ అడవులు, పర్వతాలతో ప్రకృతి రమణీయంగా కనిపించే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనుకూలమైనది. ఇక్కడ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే కష్టాలు తొలగి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.

() మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం – ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మూడో జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయం. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణాభిముఖంగా ఉండటం ప్రత్యేకత. ఇక్కడ ప్రతిరోజూ తెల్లవారుజామున నిర్వహించే భస్మ హారతి ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలానికి, మరణానికి కూడా అధిపతి అయిన మహాకాళుడిగా శివుడు ఇక్కడ పూజలందుకుంటాడు. ప్రపంచంలోని భౌతిక భయాల కంటే ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పదనే సందేశాన్ని ఈ క్షేత్రం అందిస్తుంది.

() ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం – మధ్యప్రదేశ్

నాలుగో జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో ఉన్న ఒక ద్వీపంపై ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ద్వీపం సహజంగానే పవిత్రమైన ఓంకార ఆకారాన్ని పోలి ఉండటం విశేషం. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు మానసిక ప్రశాంతత, భక్తి భావం, మోక్షాన్ని ప్రసాదించాలని శివుడిని ప్రార్థిస్తారు.

()కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం – ఉత్తరాఖండ్

ఐదో జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న కేదార్‌నాథ్. మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఈ ఆలయం శివభక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన ప్రయాణ మార్గాలు ఉన్నప్పటికీ వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.

()భీమశంకర్ జ్యోతిర్లింగం – మహారాష్ట్ర

ఆరో జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని భీమశంకర్. దట్టమైన అడవులు, ప్రకృతి అందాల మధ్య ఈ పవిత్ర ఆలయం ఉంది. పురాణాల ప్రకారం.. భీముడు అనే రాక్షసుడిని సంహరించి ధర్మాన్ని కాపాడేందుకు పరమశివుడు ఇక్కడ ఆవిర్భవించాడని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం కారణంగా ఈ క్షేత్రం ధ్యానం, ఆధ్యాత్మిక చింతనకు అనువైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

()కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం – వారణాసి, ఉత్తరప్రదేశ్

ఏడో జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం. పరమశివుడికి అంకితం చేసిన అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ శివుడిని దర్శించుకుని పూజలు చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి, ఇతర పవిత్ర పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

()త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం – నాసిక్, మహారాష్ట్ర

ఎనిమిదో జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయం. పవిత్ర గోదావరి నది జన్మస్థానంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి శివలింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపాన్ని సూచించడం విశేషం. భక్తులు ఇక్కడ వివిధ పూజలు, ఆచారాలు నిర్వహించి కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, పితృదేవతల ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు.

()వైద్యనాథ్ జ్యోతిర్లింగం – జార్ఖండ్

తొమ్మిదో జ్యోతిర్లింగం వైద్యనాథ్ లేదా బైద్యనాథ్ ధామ్. జార్ఖండ్‌లోని దేవఘర్‌లో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. ఇక్కడ పరమశివుడిని దివ్య వైద్యుడిగా ఆరాధిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తే అనారోగ్యాలు, బాధలు తొలగి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

() నాగేశ్వర జ్యోతిర్లింగం – ద్వారక, గుజరాత్

పదో జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారక సమీపంలో ఉన్న నాగేశ్వర ఆలయం. భయాలు, ప్రతికూల శక్తుల నుంచి భక్తులను రక్షించే పరమశివుడి స్వరూపంగా ఇక్కడి దేవుడిని కొలుస్తారు. ఈ ఆలయంలో పూజలు చేస్తే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయం సమీపంలో ఉన్న భారీ శివుడి విగ్రహం కూడా పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.

() రామేశ్వరం జ్యోతిర్లింగం – తమిళనాడు

పదకొండో జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరం. హిందూ సంప్రదాయంలో ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు ఇక్కడ పరమశివుడిని పూజించాడని పురాణ కథనం. ఈ ఆలయం అద్భుతమైన పొడవైన ప్రాకారాలు, పవిత్ర తీర్థాలు, ద్రావిడ శిల్పకళా నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పవిత్ర బావుల్లో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆధ్యాత్మిక శుద్ధికి ముఖ్యమైనదిగా భక్తులు భావిస్తారు.

() ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం – మహారాష్ట్ర

12వ చివరి జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్ ఆలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలకు సమీపంలో ఈ ఆలయం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో పరిమాణం పరంగా చిన్నదిగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అచంచలమైన భక్తి, శివుడి కరుణకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తోంది.