STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 4:09 pm Posted by : ARUN

Exam Cheating: మైక్రోచిప్స్,వాకీటాకీలు..పోటీ పరీక్షల్లో హైటెక్ కాపీ..గుట్టురట్టు!

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టును రట్టు చేశారు. చెవుల్లో కనిపించని చిన్న మైక్రోచిప్స్ అమర్చి, పరీక్షా కేంద్రాల బయట ఉన్న వ్యక్తుల నుంచి సమాధానాలు తెలుసుకునేలా పథకం రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మందిని అరెస్టు చేశారు.

జమ్మూకశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (JKSSB) నిర్వహించిన ఫైనాన్స్ అసిస్టెంట్ల పరీక్ష సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ పరీక్షలో అక్రమాలకు పాల్పడేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక బృందాలను మోహరించారు. పరీక్ష ప్రారంభం కాకముందే కేంద్రాల సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా అనుసరించిన విధానం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండటంతో పెన్నులు, పెన్సిళ్లు కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల చెవుల్లో అమర్చుకునే చిన్న మైక్రోచిప్స్‌ను ముఠా సభ్యులు అందించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పరీక్షా కేంద్రాల బయట ఉన్న వ్యక్తులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాధానాలను పంపితే, అభ్యర్థులు వాటిని వినేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 చిన్న వైర్‌లెస్ సెట్లు, 22 మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష రాస్తున్న వందలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగా బయట ఉన్న అనుమానితులను విచారించి, వారి ద్వారా లబ్ధి పొందాల్సిన అభ్యర్థుల వివరాలను సేకరించారు. పరీక్ష పూర్తయిన తర్వాత అనుమానిత అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.