STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 5:51 pm Posted by : ARUN

Telangana Floksong: బన్నీ ‘బుట్టబొమ్మ’ రికార్డు బ్రేక్‌.. ‘రాను బొంబాయి’ సరికొత్త సంచలనం!

తెలంగాణ జానపద పాట మరోసారి తన సత్తా చాటింది. పల్లెపాటగా ప్రారంభమైన రాను బొంబాయి పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన బుట్టబొమ్మ పాట నెలకొల్పిన రికార్డును ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ అధిగమించింది. తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ సాధిస్తూ జానపద సంగీతానికి ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది.

రాను బొంబాయి పాట విడుదలైన ఏడాదిలోపే ఏకంగా 956 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాట ఆరేళ్లలో సుమారు 955 మిలియన్ల వ్యూస్ సాధించింది. అయితే రాను బొంబాయి పాట కేవలం ఏడాదిలోనే ఈ సంఖ్యను దాటేయడం విశేషం. దీంతో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటల జాబితాలో ఈ తెలంగాణ జానపద గీతం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

సాధారణంగా సినిమా పాటలకు భారీ స్థాయిలో ప్రచారం, స్టార్ హీరోల క్రేజ్ తోడవుతుంటాయి. కానీ ఎలాంటి భారీ సినిమా నేపథ్యం లేకుండా జానపద బాణీతో రూపొందిన రాను బొంబాయి పాట ఇంతటి ఆదరణ పొందడం విశేషం. తెలంగాణ మట్టి వాసన, స్థానిక జానపద సంగీతంలోని ప్రత్యేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు.