బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ తుపానుకు అక్వాన్ అని నామకరణం చేయగా తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. నవంబర్ 16 ఉదయం 8.30 గంటల సమయానికి ఇది 11.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.
చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 910 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 17 సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మరింత బలపడి నవంబర్ 19 రాత్రికి అతి తీవ్ర తుపానుగా మారి ఏపీ తీరానికి సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ తుపాను నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు గాలుల వేగం గంటకు 145 కిలోమీటర్ల వరకు చేరవచ్చని హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో తీర ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 18 నుంచి 20 వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది.