STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 12:37 pm Posted by : ARUN

BRS:హరీష్ రావు ఇంటికి కేసీఆర్.. కుటుంబ సభ్యులతో భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్… నేడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసానికి వెళ్లనున్నారు. హరీష్ రావు తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నేరుగా హరీష్ రావు నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని హరీష్ రావు కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడపనున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరనుండటంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ప్రాధాన్యత తగ్గుతోందని, పార్టీ అధిష్టానం ఆయనను దూరం పెడుతోందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాత్ర, నాయకత్వంతో ఉన్న సంబంధాలపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కేసీఆర్ పర్యటనతో హరీష్ రావును పార్టీ దూరం పెడుతోందన్న ప్రచారానికి తెరపడుతుందా? పార్టీ నాయకత్వం, ముఖ్య నేతల మధ్య సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు ఈ భేటీతో సమాధానం లభిస్తుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.