విమానయాన రంగంలో చైనా మరో కీలక ముందడుగు వేసింది. విద్యుత్ శక్తితో నడిచే అత్యాధునిక విమానాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చైనా ప్రభుత్వ విమాన తయారీ సంస్థ COMAC రూపొందించిన CE-25A ఎలక్ట్రిక్ విమానం ఇప్పటికే ప్రయోగాత్మక పరీక్షల్లో కీలక మైలురాళ్లను చేరుకుంది. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ విమానం పైలట్ లేకుండానే స్వయంచాలకంగా ప్రయాణించే సాంకేతికతతో రూపొందించబడింది.
సుమారు 10 టన్నుల గరిష్ఠ టేకాఫ్ బరువు కలిగిన ఈ విమానంలో ఒకేసారి 19 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రూపకల్పన చేశారు. పూర్తి ఛార్జింగ్‌తో సుమారు 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతో పాటు సముద్ర మట్టానికి సుమారు 2,400 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ప్రధానంగా తక్కువ దూరంలోని నగరాల మధ్య ప్రయాణాలకు అనువుగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ విమానానికి విద్యుత్ శక్తిని అందించేందుకు రెక్కలపై అమర్చిన ప్రత్యేక డక్టెడ్ ఫ్యాన్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ విమానాల్లో ఉపయోగించే ఇంధనానికి బదులుగా విద్యుత్ ఆధారిత వ్యవస్థతో పనిచేయడం దీని ప్రత్యేకత. చైనా సంస్థలు, బ్యాటరీ తయారీ సంస్థ CATL, షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ తదితర సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
CE-25A విమానం 2026 ఫిబ్రవరి 2న తొలిసారిగా పైలట్లు లేకుండా స్వయంచాలకంగా ప్రయోగాత్మకంగా ప్రయాణించింది. ఇప్పటివరకు 19 సార్లు పైలట్ రహిత స్వయంప్రేరిత విమాన పరీక్షలను నిర్వహించినట్లు సమాచారం. తాజాగా నవంబర్ 14న ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్‌తో కలిసి తొలిసారిగా పైలట్‌తో కూడిన ప్రయోగాత్మక ప్రయాణాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది.
అయితే ఈ విమానానికి ఇంకా పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన ధ్రువీకరణ లభించలేదు. ముఖ్యంగా తక్కువ దూర ప్రయాణాలకు ఇలాంటి విమానాలు అందుబాటులోకి వస్తే ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలోనూ ఉపయోగపడే అవకాశం ఉంది.