STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 10:00 am Posted by : ARUN

Ardh Kumbh:గంగానది ప్రక్షాళన..బయటపడ్డ 150 టన్నుల చెత్త!

దేశంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించే గంగానది ప్రక్షాళనకు అధికారులు భారీ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2027లో జరగనున్న అర్ధ కుంభమేళా నేపథ్యంలో గంగానది ఘాట్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏటా నిర్వహించే అప్పర్ గంగా కెనాల్ మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం నదిలో నీటి ప్రవాహాన్ని సుమారు 18 రోజుల పాటు మళ్లించారు. దీంతో నదీ గర్భంలో పేరుకుపోయిన చెత్త బయటపడింది. సుమారు 10 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ శుభ్రత కార్యక్రమంలో 150 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు.

హరిద్వార్‌లోని ఖడ్ఖడీ నుంచి జ్వాలాపూర్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర గంగానది పరివాహక ప్రాంతాన్ని శుభ్రం చేశారు. దాదాపు 200 మంది ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు సుమారు 12 గంటల పాటు శ్రమించారు. జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో బురద, ఇసుక, ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత దుస్తులు, చెప్పులు, పూలు, కొబ్బరి చిప్పలు తదితరాలను తొలగించారు. గత ఏడాది 70 నుంచి 80 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు బయటపడగా ఈ ఏడాది అది డబుల్ కావడం విశేషం.

గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత కొందరు భక్తులు తాము ధరించిన దుస్తులను, చెప్పులను అక్కడే వదిలివెళ్తున్నారు. పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో ఇలా చేయడం వల్ల నదిలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా జులై, ఆగస్టు నెలల్లో జరిగే కన్వర్ యాత్ర సమయంలో ఘాట్ల వద్ద సుమారు 70 మెట్రిక్ టన్నుల దుస్తులు, చెప్పులు పేరుకుపోయినట్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

ప్రతి ఏడాది శుభ్రం చేస్తున్నప్పటికీ తిరిగి అదే స్థాయిలో చెత్త పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. గంగానదిని పవిత్రంగా భావించే ప్రజలే దానిని కలుషితం చేయడం విచారకరమని పారిశుద్ధ్య కార్మికులు అభిప్రాయపడుతున్నారు.ప్రతి ఏడాది నదిని శుభ్రం చేస్తున్నప్పటికీ నీటి నాణ్యత మెరుగుపడకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. 2018 నుంచి 2023 మధ్య ఉత్తరాఖండ్‌లో నమామి గంగే కార్యక్రమంపై నిర్వహించిన కాగ్ ఆడిట్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి.

హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ వద్ద నీటిలో మొత్తం కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయి 2014 అక్టోబర్‌లో 26 ఎంఎన్‌పీ/100 మిల్లీలీటర్లుగా ఉండగా, 2023 అక్టోబర్ నాటికి 130కు పెరిగింది. అంటే ఐదింతలు పెరిగినట్లు ఆడిట్ వెల్లడించింది. అంతేకాకుండా పరిశీలించిన 37 మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (STPs) 12 కేంద్రాలు శుద్ధి చేయని మురుగునీటిని గంగానది, దాని ఉపనదుల్లోకి విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. గంగానది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ నది జీవనాధారం. భక్తుల రాకపోకలు, పూజలు, పర్యాటకం, స్థానిక వ్యాపారాలు అన్నీ గంగానదిపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం నది పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. నీటి ప్రవాహాన్ని 18 రోజుల పాటు తగ్గించడం వల్ల నది లోతు, నీటి వేగం, జలచరాల ఆవాసాలు, ఆక్సిజన్ స్థాయులు కూడా ప్రభావితమయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఏటా 18 రోజుల పాటు శుభ్రం చేయడం కంటే మిగిలిన 350 రోజులూ గంగానదిలో చెత్త వేయకుండా చూడటమే అసలైన పరిష్కారమని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.