STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 12:02 pm Posted by : ARUN

TRS: ఆకాశ్ కొల్లూరును గెలిపించండి..నారాయణపేటలో టీఆర్ఎస్‌ నేతల విస్తృత ప్రచారం

TRS: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్‌) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం నారాయణపేటలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా  హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరును భారీ మెజారిటీతో గెలిపించాలని కొడంగల్ ఇన్‌ఛార్జి రాజప్రభాకర్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యావంతులు, నిరుద్యోగులు, యువత సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి అవకాశం కల్పించాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎంతో విలువైనదని డబ్బు ప్రలోభాలకు తలొగ్గకుండా అభ్యర్థి ఆలోచనలు, ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని పరిశీలించి ఓటు వేయాలని సూచించారు. పట్టభద్రుల గొంతుకగా మండలిలో తమ అభ్యర్థి నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జి డాక్టర్ రఘు, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి రంజిత్ కుమార్ గంగోళ్ల, నారాయణపేట ఇన్‌ఛార్జి గవినోళ్ల శ్రీనివాస్, మక్తల్ ఇన్‌ఛార్జి, మాజీ జడ్పీటీసీ సీహెచ్ వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నారాయణపేట బార్ అసోసియేషన్ సభ్యులతో తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆకాశ్ కొల్లూరుకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు.