- నారాయణపేటలో టీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం
- ఓటును అమ్ముకోవద్దని విజ్ఞప్తి
- విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారానే వ్యవస్థలో మార్పు సాధ్యం
- టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజప్రభాకర్
- స్టార్ త్రినేత్రం, నారాయణపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి లోనుకాకుండా, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజ ప్రభాకర్ పట్టభద్రులను కోరారు. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం నారాయణపేటలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజ ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
విద్యావంతులు, నిరుద్యోగులు, యువత సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎంతో విలువైనదని డబ్బు ప్రలోభాలకు తలొగ్గకుండా అభ్యర్థి ఆలోచనలు, ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని పరిశీలించి ఓటు వేయాలని సూచించారు. పట్టభద్రుల గొంతుకగా మండలిలో తమ అభ్యర్థి నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతుల సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌ఛార్జి డాక్టర్ రఘు, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి రంజిత్ కుమార్ గంగోళ్ల, నారాయణపేట ఇన్‌ఛార్జి గవినోళ్ల శ్రీనివాస్, మక్తల్ ఇన్‌ఛార్జి, మాజీ జడ్పీటీసీ సీహెచ్ వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: TRS: ఆకాశ్ కొల్లూరును గెలిపించండి..నారాయణపేటలో టీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం