Nvidia Scandal: చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ చైనా ప్రభుత్వానికి గూఢచారిగా పనిచేస్తున్నారా? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న సంబంధం వెనుక ఏదైనా నిఘా కుట్ర ఉందా? ఈ ప్రశ్నలపై అమెరికా నిఘా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి అనే ఆరోపణలకు ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదని సీఐఏ సహా పలువురు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ (MSS) ఆలిస్ హువాంగ్‌ను నియమించి జెన్సన్ హువాంగ్‌పై నిఘా పెట్టిందా? ఆయన ద్వారా అమెరికా విధాన నిర్ణేతలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిందా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ కనీసం ఏడాది కాలంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలిస్ అసలు గుర్తింపు, చైనా నిఘా సంస్థలతో ఆమెకున్న సంబంధాలపై ఇప్పటికీ తుది నిర్ధారణకు రాలేదు.
అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే సైతం ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదని వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆలిస్ గూఢచారిగా పనిచేస్తున్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆమె నిజంగా గూఢచారి అని తేలితే జెన్సన్ హువాంగ్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని సమర్థించవచ్చని అభిప్రాయపడ్డారు.
మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం, సీఐఏలోని కొందరు అధికారులు ఈ ఆరోపణలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆలిస్ ఉద్దేశపూర్వకంగా చైనాకు రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు ఆధారాలు లేవని వారు భావిస్తున్నారు. అయితే మరికొందరు అధికారులు ఆమెకు చైనా నిఘా సంస్థలతో సంబంధాలు ఉండే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు.
ఎవరీ ఆలిస్ హువాంగ్?
సింగపూర్ కేంద్రంగా మెగాస్పీడ్ (Megaspeed) అనే సంస్థను నిర్వహిస్తున్న ఆలిస్ హువాంగ్.. ఎన్విడియా చిప్‌లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చైనాకు నిషేధిత ఎన్విడియా చిప్‌లను తరలించేందుకు విదేశీ షెల్ కంపెనీలు ఉపయోగపడుతున్నాయనే అనుమానాలతో 2024లో అమెరికా న్యాయశాఖ, వాణిజ్యశాఖలు మెగాస్పీడ్‌పై దర్యాప్తు ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.