Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లతో నకిలీ వీడియోలు సృష్టించి అమాయకులను పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంబంధించిన ఫేక్ వీడియోను ఉపయోగించి ఓ మహిళ నుంచి ఏకంగా రూ.49.2 లక్షలు కాజేశారు. ఈ ఘటన కేరళంలోని కోజికోడ్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవల ఫేస్‌బుక్ చూస్తుండగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడులు పెట్టాలంటూ సూచిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో కనిపించింది. ప్రముఖ మంత్రి స్వయంగా పెట్టుబడుల గురించి చెబుతున్నారని నమ్మిన ఆమె.. ఆ వీడియోకు జతచేసి ఉన్న లింక్‌ను క్లిక్ చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఆమెను తమ వలలోకి దింపారు.
పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని నమ్మించిన కేటుగాళ్లు.. వివిధ దఫాలుగా ఆమె నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం రూ.49.2 లక్షలను సైబర్ నేరగాళ్లకు బాధితురాలు పంపించారు. అయితే రోజులు గడుస్తున్నా పెట్టుబడిపై ఎలాంటి లాభాలు రాకపోగా, తాను పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి రాలేదు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ప్రముఖుల పేర్లతో సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల వీడియోలు కనిపించినంత మాత్రాన అవి నిజమైనవని భావించకూడదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ విశ్వసనీయతను పరిశీలించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.
