STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 10:57 am Posted by : ARUN

Whatsapp: వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు..ఏఐ ఫీచర్లతో ప్రైవసీకి పూర్తి భద్రత!

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన సేవలను మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు వారి విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐ సాంకేతికతను తీసుకురానున్నట్లు వాట్సాప్ గ్లోబల్ హెడ్ (సీఈఓ) కునాల్ షా వెల్లడించారు. అదే సమయంలో యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రైవసీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

మెటా సంస్థ వాట్సాప్ బాధ్యతలను కునాల్ షాకు అప్పగించిన తర్వాత యూజర్ల అభిప్రాయాలను తెలుసుకుని ఈ కీలక ప్రకటన చేశారు. వాట్సాప్ భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం వాట్సాప్‌లో రోజూ బిలియన్ల కొద్దీ వాయిస్ మెసేజ్‌లు, స్టిక్కర్లు షేర్ అవుతున్నాయి. కాలానికి తగినట్లుగా కమ్యూనికేషన్ పద్ధతులు మారుతున్నందున వాయిస్ నోట్స్, గ్రూప్ చాట్స్, వీడియో కాల్స్ మరియు స్టిక్కర్ల ఫీచర్లను మరింత సులభతరం చేయనున్నారు. చాలామంది ఏదైనా బిల్లు చెల్లించాలన్నా, రుణాలు తీసుకోవాలన్నా లేదా ప్రయాణ సమయాల్లో ఇతర యాప్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా.. వాట్సాప్ చాట్ విండోలోనే బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక సేవలను సులభంగా పూర్తి చేసేలా ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం భాగస్వాములతో కలిసి సంస్థ పనిచేస్తోంది.

టెక్నాలజీ అనేది మనుషుల సమయాన్ని ఆదా చేసేలా ఉండాలనే ఉద్దేశంతో ఏఐని ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులు ఏవైనా ముఖ్యమైన అపాయింట్‌మెంట్లు లేదా బుకింగ్‌లను కోల్పోకుండా ఏఐ సాయపడనుంది. తద్వారా యూజర్లు తమ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది.వాట్సాప్‌లో జరిగే వ్యక్తిగత మెసేజ్‌లు, వాయిస్ మరియు వీడియో కాల్స్ అన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ విధానంలోనే సురక్షితంగా ఉంటాయని కునాల్ షా మరోసారి స్పష్టం చేశారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు.