STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 4:08 pm Posted by : ARUN

Special Parliament Session:మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?

మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ కంటే 15 నుంచి 18 ఓట్లు ఎక్కువగా వస్తాయని కేంద్రం భావిస్తోంది.

అయితే ప్రత్యేక సమావేశాల తేదీలు, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశాలపై ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో 361 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలంపై కేంద్రం దృష్టి సారించింది.

ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850 వరకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఇదే అంశంపై గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్ 17న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో మరోసారి బిల్లును సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడినప్పటికీ (అడ్జర్న్ సైన్ డై), ఇప్పటివరకు అధికారికంగా ప్రొరోగ్ చేయలేదు. ఈ సమావేశాలు ప్రొరోగ్ కాకుండా 91 రోజులు గడిచాయి. 2008లో నమోదైన 87 రోజుల రికార్డును ఇది అధిగమించింది. ఇప్పటికే కొనసాగుతున్న సమావేశాలను పొడిగించి నిర్వహించాలంటే కనీసం రెండు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలి. అదే కొత్త సమావేశాలను నిర్వహించాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు అవసరం. వర్షాకాల సమావేశాలను కేంద్రం ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక లేదా పొడిగించిన సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.

నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు కేంద్రం మరో ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలను 50 శాతం చొప్పున పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోంది.

గతంలో ప్రతిపాదించిన అంశాలకు కొనసాగింపుగా రూపొందించిన తాజా ముసాయిదాలో 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తులను కొనసాగించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పరిశీలనలో ఉన్న పలు ప్రత్యామ్నాయాల్లో ఒకటి మాత్రమేనని ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.