STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 12:59 pm Posted by : ARUN

Jaggareddy: సోనియా బయోపిక్‌పై జగ్గారెడ్డి సంచలనం..కార్యకర్తలే నిర్మాతలు సినిమా తీస్తా!

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత చరిత్రను తెలుగు వెండితెరపై ఆవిష్కరించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకం ఆధారంగా తెలుగులో ఒక భారీ సినిమాను నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి ఈ ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీది ఎంతో విజయవంతమైన, స్ఫూర్తిదాయకమైన రాజకీయ జీవితమని కొనియాడారు. భారత రాజకీయాల్లో మరియు దేశ ప్రజల హృదయాల్లో ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ సతీమణిగా, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు తల్లిగా ఆమె సాగించిన జీవన ప్రయాణాన్ని, త్యాగాలను నేటి తరం ప్రజలకు సినిమా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాలనేదే తన ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను కూడా స్థానిక నాయకులు, కార్యకర్తలకే అప్పగిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు డబ్బులు రెడీ చేసుకోండి…. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరిస్తారు అని ఆయన పిలుపునిచ్చారు. సినిమా నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్‌ను ఘనంగా ప్రారంభిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ విభిన్న శైలిలో వ్యవహరించే జగ్గారెడ్డి…ఇప్పుడు ఏకంగా సోనియా గాంధీ బయోపిక్ తీస్తానని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.