దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో చేరాలని ఎంతోమంది యువత కలలు కంటుంటారు. ఇందుకోసం ఏళ్ల తరబడి కష్టపడి చదువుతూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించినంత మాత్రాన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయిపోలేరు. చివరి దశలో నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) కూడా ఎంతో కీలకం. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల పరిజ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి, ఆలోచనా విధానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
ముఖ్యంగా కొన్నిసార్లు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలు అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తుంటాయి. అలాంటి ప్రశ్నల్లోనే ‘ఒక్క చేత్తో ఏనుగును ఎలా ఎత్తగలరు?’ అనే ప్రశ్న ఆసక్తికరంగా ఉంటుంది. ఏనుగు బరువు వేల కిలోలు ఉంటుందని తెలిసినా ఈ ప్రశ్నకు నేరుగా అసాధ్యమని సమాధానం చెప్పడం కంటే ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థుల సాధారణ జ్ఞానాన్ని మాత్రమే కాకుండా వారి తార్కిక ఆలోచనా శక్తిని, ప్రశ్నను అర్థం చేసుకునే విధానాన్ని పరీక్షిస్తాయి. ఉదాహరణకు ఏనుగు బొమ్మను లేదా ఏనుగు చిత్రాన్ని ఒక్క చేత్తో ఎత్తవచ్చని సమాధానం చెప్పడం ద్వారా ప్రశ్నలోని పదాలను మరో కోణంలో ఆలోచించవచ్చు.
UPSC ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు పుస్తకాల్లో ఉన్న సమాధానమే చెప్పాల్సిన అవసరం ఉండదు. కొన్ని ప్రశ్నలకు అభ్యర్థి ఇచ్చే సమాధానం కంటే దాని వెనుక ఉన్న ఆలోచనా విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. క్లిష్టమైన ప్రశ్న ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించి సమాధానం చెప్పాలి.
అలాగే తెలియని ప్రశ్న ఎదురైతే తప్పుగా సమాధానం చెప్పడం కంటే తనకు తెలియదని నిజాయితీగా అంగీకరించడం మంచిది. ఆత్మవిశ్వాసం, వినయంతో పాటు స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం కూడా ఇంటర్వ్యూలో కీలక పాత్ర పోషిస్తాయి.
అందుకే UPSC అభ్యర్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులపై తార్కికంగా ఆలోచించే అలవాటు పెంచుకోవాలి. ఇలాంటి ట్రిక్కీ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ద్వారా తమ ఆలోచనా పరిధిని మరింత విస్తరించుకోవచ్చు.