సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) తన వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియోల నుంచి నచ్చిన భాగాన్ని కట్ చేసి ప్రత్యేక క్లిప్‌గా పోస్ట్ చేసుకునేలా క్లిప్పింగ్ టూల్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా ఇతరులు రూపొందించిన సుదీర్ఘ వీడియోల్లోని ఆసక్తికరమైన సన్నివేశాలను ఎంపిక చేసుకుని, వాటికి తమ అభిప్రాయాలను జోడించి ఎక్స్‌లోనే షేర్ చేయవచ్చు.
ఇప్పటివరకు ఎక్స్‌లోని వీడియోల నుంచి చిన్న క్లిప్స్ తయారు చేయాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకుని ఇతర ఎడిటింగ్ టూల్స్ ద్వారా కట్ చేసి మళ్లీ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో అసలు వీడియో రూపొందించిన క్రియేటర్లకు సరైన గుర్తింపు లభించకపోవడంతో పాటు, వారి కంటెంట్ ద్వారా ఆదాయం పొందే అవకాశం కూడా తగ్గేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎక్స్ కొత్త క్లిప్పింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్‌తో రూపొందించిన ప్రతి క్లిప్‌పై ‘Clip from’ అనే లేబుల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అసలు వీడియోకు వెళ్లవచ్చు. దీంతో వీడియో రూపొందించిన వ్యక్తి వివరాలు, అతడి ఇతర కంటెంట్‌ను కూడా వీక్షకులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. క్లిప్ తయారు చేసిన వ్యక్తితో పాటు అసలు వీడియో క్రియేటర్ కూడా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే సంబంధిత ఖాతాలు ఆ రివార్డుల కార్యక్రమానికి అర్హత కలిగి ఉండాలి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పొడవైన పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్ వీడియోల నుంచి చిన్న క్లిప్స్ తయారు చేసి వైరల్ చేయడం ట్రెండ్‌గా మారింది. పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఇందుకోసం ప్రత్యేక సంస్థల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. బ్రాండ్లు తమ మార్కెటింగ్ ప్రచారాల్లోనూ ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ స్వయంగా క్లిప్పింగ్ టూల్‌ను తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవలి కాలంలో యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా ఎక్స్ తన వీడియో సేవలను విస్తరిస్తోంది. తాజాగా క్లిప్పింగ్ ఫీచర్ ద్వారా ఎక్స్‌లో వీడియోల వీక్షణలు, క్రియేటర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.