Telangana: తెలంగాణలోని విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్, వాణిజ్య కార్యక్రమాల నిర్వహణపై నిషేధం విధించే దిశగా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలను కేవలం విద్యా సంబంధిత కార్యకలాపాలకే పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాలేజీలు, యూనివర్సిటీల ప్రాంగణాల్లో సినిమా ప్రచార కార్యక్రమాలు, వాణిజ్యపరమైన ఈవెంట్లు నిర్వహించకుండా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది.
కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే వాటిని ఉల్లంఘించే విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కాలేజీలు, యూనివర్సిటీల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను రూపొందించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక చట్టాన్ని ప్రతిపాదించనున్నట్లు సమాచారం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, విద్యాసంస్థల్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేలా నిబంధనలు రూపొందించనున్నారు. ఈ అంశాలపై కసరత్తు పూర్తయిన తర్వాత త్వరలోనే ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
అయితే కొత్త ఆంక్షలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.