తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున ఎన్ని పోరాటాలు చేసినా ఆశించిన మార్పు రావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరంగల్ – ఖమ్మం- నల్గొండ నుండి శ్రీకాంత్ గౌడ్ , హైదరాబాద్-మహబూబ్ నగర్- రంగారెడ్డి నుండి ఆకాశ్ కొల్లూరులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో దించుతున్నట్లు తెలిపారు. ఇవాళ్టి నుండి అఫిషియల్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు కవిత.
ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావాలంటే ఓటు ద్వారా ప్రజలు తమ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో సుమారు 4 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని కవిత తెలిపారు. అయితే ఇప్పటివరకు 80 లక్షల మందిలో కనీసం 10 లక్షల మంది కూడా ఓటర్లుగా నమోదు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తగిన సమాధానం చెప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది యువ ఎంపీల్లో కేవలం ఒక్కరికి మాత్రమే రాజకీయ నేపథ్యం లేదని కవిత వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సామాన్యులకు, యువతకు అవకాశాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేయాలని చూస్తోందని ఆరోపించారు. యువ గ్రాడ్యుయేట్లు డబ్బులకు ప్రలోభపడకుండా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని 77 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయని కవిత వెల్లడించారు. బుధవారం నుంచే అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులకు వీర తిలకం దిద్ది ఎన్నికల యుద్ధరంగంలోకి పంపిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తమ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు ఉందని కవిత తెలిపారు. పార్టీ గుర్తింపునకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ, వాటికి సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు కావడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పునకు నాంది పలకాలని ఆమె పిలుపునిచ్చారు.