గుజరాత్లో పరువు హత్య ఘటన కలకలం రేపింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కారణంతో ఓ తండ్రి తన కన్నకూతురినే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీపావళి పండుగ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత కుమార్తె మరణాన్ని సహజ మరణంగా లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం బయటపడింది.
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంభాట్ తాలూకా మేత్పూర్ గ్రామానికి చెందిన కౌశల్‌కుమార్ పటేల్‌కు 21 ఏళ్ల కుమార్తె సాన్యా పటేల్ ఉంది. ఆమె ఆ కుటుంబానికి ఏకైక సంతానం. వడోదరలో బీకామ్ పూర్తి చేసిన సాన్యా.. తన గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన యువకుడితో గత ఏడాది కాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కౌశల్‌కుమార్ వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. కులాలు వేరుకావడంతో పాటు ఆ యువకుడి సంపాదన కూడా తండ్రికి నచ్చలేదని పోలీసులు తెలిపారు. అతడితో మాట్లాడటం మానుకోవాలని, ప్రేమ సంబంధాన్ని తెంచుకోవాలని పలుమార్లు కుమార్తెను హెచ్చరించాడు. అయినప్పటికీ సాన్యా తన ప్రేమను వదులుకోవడానికి నిరాకరించింది.
దీపావళి రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంట్లో కలిసి గడిపారు. అనంతరం అర్ధరాత్రి దాటాక ఇతర కుటుంబ సభ్యులు నిద్రకు వెళ్లిపోయారు. ఆ సమయంలో వంటగదిలో తండ్రీకూతుళ్ల మధ్య మరోసారి ప్రేమ వ్యవహారంపై చర్చ జరిగింది. యువకుడితో సంబంధాన్ని తెంచుకోవాలని తండ్రి మరోసారి ఒత్తిడి చేయగా.. సాన్యా అందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశల్‌కుమార్.. కుమార్తె ధరించిన దుపట్టాతోనే ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కుమార్తె మరణించిన తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యగా లేదా సహజ మరణంగా చిత్రీకరించేందుకు తండ్రి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. సాన్యా మృతదేహాన్ని ఖంభాట్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె మరణించిన తీరు వైద్యులకు అనుమానం కలిగించింది. దీంతో ఫోరెన్సిక్ పరీక్షలతో పాటు పోస్టుమార్టం నిర్వహించాలని సూచించారు. పోస్టుమార్టం నివేదికలో మెడపై ఒత్తిడి పడటంతో ఊపిరాడక మరణించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తండ్రి కౌశల్కుమార్ను పోలీసులు విచారించారు. విచారణలో కుమార్తెను తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపగా… కులాంతర ప్రేమ సంబంధం కారణంగా కన్నకూతురినే తండ్రి హత్య చేసిన ఘటన గుజరాత్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది