STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 1:20 pm Posted by : ARUN

Ekadashi:నవంబర్‌లో రెండో ఏకాదశి ఎప్పుడో తెలుసా..శుభ ముహూర్తం వివరాలివే!

హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తూ చాలామంది ఉపవాసం పాటిస్తారు. నవంబర్ 2026లో రెండు ఏకాదశులు రానున్నాయి. ఇప్పటికే నవంబర్ 5న రమా ఏకాదశి పూర్తికాగా.. రెండో ఏకాదశిగా పిలిచే దేవుత్థాన ఏకాదశి నవంబర్ 20న రానుంది. దీనినే దేవ్ ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు.

హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి నవంబర్ 20 శుక్రవారం ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 21 శనివారం ఉదయం 6:31 గంటలకు ముగుస్తుంది. స్మార్త సంప్రదాయాన్ని అనుసరించే వారు నవంబర్ 20న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో మాత్రం నవంబర్ 21న వ్రతాన్ని పాటించే ఆచారం ఉంది.

నవంబర్ 20న అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:28 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును పూజించవచ్చని పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి.

స్మార్త సంప్రదాయం ప్రకారం ఏకాదశి వ్రతాన్ని నవంబర్ 21న మధ్యాహ్నం 1:11 గంటల నుంచి 3:18 గంటల మధ్య ద్వాదశి పారణ సమయంలో విరమించవచ్చు. వైష్ణవ సంప్రదాయంలో నవంబర్ 21న వ్రతం ఆచరించే వారు నవంబర్ 22న పారణ చేయాలి. ఖచ్చితమైన సమయాలు ప్రాంతీయ పంచాంగాన్ని బట్టి మారవచ్చు.

హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటారని భక్తుల విశ్వాసం. దీంతో నాలుగు నెలల చాతుర్మాసం ముగుస్తుంది. ఈ పర్వదినం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయని సంప్రదాయంగా భావిస్తారు. ఈ సందర్భంగా తులసి వివాహం కూడా నిర్వహిస్తారు.