STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 2:22 pm Posted by : ARUN

AQI:గాలి కాలుష్యంతో అనారోగ్య సమస్యలు.. వైద్యుల హెచ్చరిక!

వాయు కాలుష్యం అంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. అయితే కలుషిత గాలి ప్రభావం ఊపిరితిత్తులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పాటు కాలుష్య గాలిని పీల్చడం వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం, చర్మం, జీర్ణవ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

ముఖ్యంగా పీఎం 2.5 వంటి సూక్ష్మ కాలుష్య కణాలు శరీరానికి తీవ్ర హాని కలిగిస్తాయని తెలిపారు. ఈ కణాలు వెంట్రుక మందంతో పోలిస్తే దాదాపు 30 రెట్లు చిన్నవిగా ఉంటాయి. అందువల్ల శరీర సహజ రక్షణ వ్యవస్థను దాటుకుని ఊపిరితిత్తుల్లోకి లోతుగా చేరుతాయి. అక్కడి నుంచి కొన్ని కణాలు రక్తప్రవాహంలోకి ప్రవేశించి శరీరమంతా వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.

కాలుష్య గాలికి ఎక్కువకాలం గురికావడం వల్ల రక్తపోటు పెరగడం, గుండె లయలో మార్పులు రావడం, ధమనులు సన్నబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చని డాక్టర్ అగర్వాల్ తెలిపారు. దీనివల్ల గుండెపోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్ ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా దీర్ఘకాలిక కాలుష్య ప్రభావం మెదడు పనితీరుపైనా పడవచ్చని, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

రక్తంలోని వ్యర్థాలను వడపోసే మూత్రపిండాలపై కూడా కాలుష్య కణాల ప్రభావం ఉంటుందని వైద్యుడు వివరించారు. రక్తప్రవాహంలోకి చేరిన విషపూరిత పదార్థాలను తొలగించే క్రమంలో మూత్రపిండాల పనితీరు దెబ్బతినవచ్చని దీర్ఘకాలంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ముప్పు పెరగవచ్చని తెలిపారు. కాలేయంలోనూ ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి కణాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు.

వాయు కాలుష్యం వల్ల చర్మం పొడిబారడం, మచ్చలు, వర్ణంలో మార్పులు, వాపు, త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం వంటి సమస్యలు రావచ్చని డాక్టర్ అగర్వాల్ పేర్కొన్నారు. కాలుష్య కణాలు జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కూడా దెబ్బతీయవచ్చని, తద్వారా జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుందని వివరించారు.

()స్థానికంగా గాలి నాణ్యత సూచీ (AQI) వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

()కాలుష్యం తీవ్రంగా ఉన్న రోజుల్లో అవసరం లేని బయటకు వెళ్లడాన్ని తగ్గించాలి.

()బయట వ్యాయామాలు, శ్రమతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

()బయటకు వెళ్లాల్సి వస్తే సరిగ్గా అమర్చుకునే N95 మాస్క్ ధరించాలి.

()ఇంట్లోకి కాలుష్య గాలి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల కాలుష్యాన్ని తేలికగా తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.