2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించడానికి కొన్ని నెలల ముందే సోనియా గాంధీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టాలా? వద్దా? అనే విషయంపై అప్పటికే ఆమె స్పష్టతతో ఉన్నారు. పార్టీ విజయం సాధిస్తే ప్రధాని అవుతారా? అని తన పిల్లలు రాహుల్, ప్రియాంక అడిగినప్పుడు.. “ఖచ్చితంగా వద్దు!” అంటూ తేల్చి చెప్పినట్లు సోనియా వెల్లడించారు.
హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన తన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’లో సోనియా గాంధీ ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2004 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని తిరస్కరించే నిర్ణయం తీసుకునే ముందు చోటుచేసుకున్న పరిణామాలను ఆమె ఇందులో వివరించారు.
ఎన్నికలకు కొన్ని నెలల ముందు నా ప్రధానమంత్రి పదవిపై పిల్లలతో చర్చించాను. పార్టీ విజయం సాధిస్తే ఆ పదవిని స్వీకరిస్తారా? అని వారిలో ఒకరు నేరుగా అడిగారు. ఖచ్చితంగా వద్దు అని దాదాపు ఆగ్రహంగా సమాధానమిచ్చాను. మీరు కచ్చితంగా చెప్పగలరా? అని వారు మళ్లీ అడిగారు. నాకు చాలా స్పష్టత ఉంది అని చెప్పాను. రాహుల్, ప్రియాంక ఇద్దరూ నేను ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు అని ఆమె రాసుకొచ్చారు.
తమ నానమ్మ ఇందిరాగాంధీ హత్య, తండ్రి రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదనే పిల్లల అభ్యంతరాలకు కారణమని సోనియా తెలిపారు. ప్రధానమంత్రి పదవి చేపడితే ప్రమాదం మరింత పెరుగుతుందని వారు భావించారని పేర్కొన్నారు. తన అభిప్రాయాన్ని బయటపెట్టిన తర్వాత తనకూ కొంత ఉపశమనం కలిగిందని చెప్పారు.
అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేదని సోనియా తెలిపారు. పార్టీ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో నాయకత్వ పోరు మొదలవడం తనకు ఇష్టం లేదన్నారు. పార్టీ నేతలందరినీ ఐక్యంగా ఉంచడం అవసరమని భావించినట్లు వివరించారు.
2004 ఎన్నికల్లో యూపీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని పదవిపై మళ్లీ చర్చ మొదలైంది. పార్టీ కార్యకర్తలు, ఓటర్ల పట్ల బాధ్యత ఒకవైపు.. వ్యక్తిగత అభిప్రాయం మరోవైపు తనను సంఘర్షణకు గురిచేశాయని సోనియా పేర్కొన్నారు. తన నివాసంలో సమావేశమైన కూటమి నేతలు గంటకు పైగా ప్రధాని పదవిని స్వీకరించాలని కోరినట్లు తెలిపారు.
ఆ సమయంలో నేతలు తన చుట్టూ చేరి నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆమె రాశారు. తాను సరే అని అన్న మాటను వారు అంగీకారంగా భావించి అభినందనలు కూడా తెలిపారని వివరించారు. అయితే కిటికీ బయట నుంచి ఈ పరిణామాన్ని గమనించిన ప్రియాంక…ఒత్తిడికి తలొగ్గుతున్నారని భావించి వెంటనే రాహుల్‌ను పిలిచారు.
రాహుల్, ప్రియాంక తనను ప్రశ్నించినప్పుడు.. నాకు ప్రధాని కావాలని లేదు. మీకు కూడా ఆ విషయం తెలుసు. నాపై ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పినట్లు సోనియా వెల్లడించారు. అమ్మా.. నువ్వు మొదటి నుంచీ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నావు. ఎవరి ఒత్తిడికీ తలొగ్గవద్దు. నువ్వు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడు. మేమిద్దరం నీకు అండగా ఉంటాం అని ప్రియాంక చెప్పినట్లు వివరించారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ సోనియాపై ప్రధాని పదవి చేపట్టాలని నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే తన ప్రసంగంలో ఆమె స్పష్టంగా తిరస్కరించారు. గత ఆరేళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. ప్రధానమంత్రి పదవి నా లక్ష్యం కాదని మొదటి నుంచీ చెబుతున్నాను. నా అంతరాత్మ చెప్పిన మాట ప్రకారం ఈ పదవిని వినయంగా తిరస్కరిస్తున్నాను అని ప్రకటించారు.
ఆమె నిర్ణయంపై కొందరు ఎంపీలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రసంగం మధ్యలోనే ఆపాల్సి వచ్చిందని సోనియా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం కష్టమై, కళ్లు తిరిగినట్లు అనిపించిందని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి పదవికి మన్మోహన్ సింగ్ పేరును సోనియా ప్రతిపాదించారు. దీంతో 2004 నుంచి 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఈ విషయాలను తన ఆత్మకథలో వెల్లడించారు సోనియా.