STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 4:26 pm Posted by : ARUN

Venky Kudumula:డూప్ లేకుండానే అనీష్‌ యాక్షన్ సీన్లు…వెంకీ కుడుముల ఆసక్తికర వ్యాఖ్యలు!

నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. మహేశ్ ఉప్పాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు.

ఈ సినిమా గురించి వెంకీ కుడుముల పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మంచి కథతో నిర్మాతగా మారాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. దర్శకుడు మహేశ్ ఉప్పాల చెప్పిన కథ కొత్తగా, ఆసక్తికరంగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌తోనే నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

అనీష్ తనకు ముందే పరిచయమని, తరచూ ఆఫీసుకు వచ్చి సినిమాలపై తనకున్న ఆసక్తిని తెలియజేసేవాడని వెంకీ వెల్లడించారు. నటన, డ్యాన్స్, యాక్షన్ వంటి అంశాల్లో అనీష్ తీసుకున్న శిక్షణ, కష్టపడే తత్వం తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ సినిమాలో హీరో మాటలు మాట్లాడలేని పాత్రలో కనిపిస్తాడని, అలాంటి పాత్రకు కొత్త నటుడు అయితే ప్రేక్షకులు మరింత సహజంగా కనెక్ట్ అవుతారని భావించినట్లు చెప్పారు. అనీష్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడని, కథ విన్న అనస్వర రాజన్ కూడా వెంటనే అంగీకరించిందని వివరించారు.

అనీష్ నటన గురించి మాట్లాడుతూ.. యాక్షన్ సన్నివేశాల్లో అతను అద్భుతంగా నటించాడని వెంకీ ప్రశంసించారు. సినిమాలో ఎక్కడా డూప్‌ను ఉపయోగించలేదని భవిష్యత్తులో అనీష్ హీరోగా తానే దర్శకత్వం వహిస్తూ ఓ సినిమా చేసే ఆలోచన కూడా ఉందని తెలిపారు. ఈ సినిమా గ్లింప్స్‌ను తొలుత నాగార్జునకు చూపించామని, ఆయనకు నచ్చితేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరినట్లు వెంకీ చెప్పారు. గ్లింప్స్‌లోని సినిమాటోగ్రఫీ నాగార్జునను ఎంతగానో ఆకట్టుకుందని, తన తదుపరి చిత్రం ‘కింగ్ 100’కు కూడా అదే సినిమాటోగ్రాఫర్‌ను ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. ‘ఇట్లు అర్జున’ సినిమాను కూడా నాగార్జున వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారని, ఇది తొలి చిత్ర నిర్మాతగా తనకు ఎంతో సంతృప్తిని, నమ్మకాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

దర్శకుడు మహేశ్ ఉప్పాలతో పరిచయం గురించి మాట్లాడుతూ.. సినిమా తీయాలనే అతని పట్టుదల తనను ఆకట్టుకుందని వెంకీ తెలిపారు. గతంలో మహేశ్ ఓ విజయవంతమైన వెబ్ సిరీస్‌ను రూపొందించినప్పటికీ, తదుపరి అవకాశం రావడంలో ఆలస్యం కావడంతో రాపిడో డ్రైవర్‌గా కూడా పనిచేశాడని వెల్లడించారు. అతని ప్రయాణం, ప్రతిభ తనకు నచ్చాయని చెప్పారు. తాను కూడా కెరీర్ ప్రారంభంలో అవకాశం పొందానని, అదే విధంగా కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మహేశ్‌కు అవకాశం ఇచ్చినట్లు వివరించారు.