STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 2:34 pm Posted by : ARUN

Food Fraud:కల్తీకి కేరాఫ్‌గా భారత్.. మనం తింటున్న ఆహారంలో అసలేం కలుపుతున్నారు?

మనం ప్రతిరోజూ తినే ఆహారం నిజంగా స్వచ్ఛమైనదేనా? మార్కెట్లో కొనుగోలు చేస్తున్న పాలు, పిండి, నెయ్యి, ఇతర ఆహార పదార్థాల్లో ఏమైనా కల్తీ జరుగుతోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో ఆహార కల్తీ అనేది కేవలం కొంతమంది వ్యాపారులు లాభాల కోసం చేసే చిన్నపాటి మోసంగా మిగలడం లేదు. క్రమబద్ధమైన నెట్‌వర్క్‌ల ద్వారా సాగుతున్న పెద్ద వ్యాపారంగా మారుతోందనే అంశం వెలుగులోకి వచ్చింది.

గతంలో పాలలో నీళ్లు కలపడం, నెయ్యిలో ఇతర నూనెలు కలపడం వంటి కల్తీ ఘటనలు ఎక్కువగా వినిపించేవి. పండుగల సమయంలో నకిలీ ఖోవా తయారీ, కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు కూడా వెలుగులోకి వచ్చేవి. నకిలీ బుక్వీట్ పిండి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తిన ఘటనలు సైతం నమోదయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు ఆహార కల్తీ ఎంతటి వ్యవస్థీకృత రూపం దాల్చిందో తెలియజేస్తున్నాయి.

తాజా అండర్‌కవర్‌ పరిశోధనలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని పిండి మిల్లుల్లో గోధుమ పిండిలో సోప్‌స్టోన్‌ (తెల్లటి రాయి పొడి) కలుపుతున్నట్లు బయటపడింది. కొంతమంది జర్నలిస్టులు కార్మికులుగా మారి సుమారు 25 రోజులపాటు మిల్లుల్లో పనిచేసి ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. పిండికి తెల్లదనం, బరువు పెంచేందుకు ఈ తరహా కల్తీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై ఆహార భద్రతా అధికారులు కూడా దృష్టి సారించారు. లక్నోలో ఆగస్టు 4 నుంచి 6 వరకు నిర్వహించిన తనిఖీల్లో 5.5 టన్నుల మైదాను స్వాధీనం చేసుకున్నారు. పురుగులు పట్టిన 950 కిలోల సూజీని ధ్వంసం చేశారు. పది ఆహార నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. అయితే లక్నోలో కల్తీ జరిగినట్లు అధికారులు అప్పటికి నిర్ధారించలేదు.

ఆహార పదార్థాల్లో కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నాణ్యత లేని పదార్థాలను దీర్ఘకాలం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వినియోగదారులు ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు తయారీదారు వివరాలు, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ, FSSAI లైసెన్స్ వివరాలను పరిశీలించాలి. అనుమానాస్పదంగా కనిపించే ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా, వాటిపై సంబంధిత ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వ పర్యవేక్షణతో పాటు వినియోగదారుల అప్రమత్తత కూడా ఎంతో అవసరం.