STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 7:38 am Posted by : ARUN

White House:వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు..ట్రంప్‌కు గిఫ్ట్‌గా హనుమాన్ చాలీసా

అమెరికాలోని వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారతీయ టెక్ పారిశ్రామికవేత్త, GOQii సంస్థ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు.

వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో భాగంగా విశాల్ గొండాల్.. అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి సంప్రదాయబద్ధంగా దీపాలను వెలిగించారు. అనంతరం తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని విశాల్ గొండాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు.

ఓవల్ ఆఫీస్‌లో వెలుగులు పంచుకునే ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ధైర్యం, భక్తి, శక్తిని ప్రసాదించాలని కోట్లాది మంది పఠించే హనుమాన్ చాలీసాను ట్రంప్‌కు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. దీపాలు వెలిగించిన సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.

ఈ దీపావళి వేడుకలకు ప్రముఖ భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు కూడా హాజరయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మిషెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, కెనడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు రూబీ ధల్లా తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతికి ప్రాధాన్యం లభించడం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.