STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 3:08 pm Posted by : ARUN

Priyanka Chopra:ప్రియాంక చోప్రా నటిగా కాదు నిర్మాతగా..క్రేజీ ప్రాజెక్టు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మళ్లీ భారతీయ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా భారతీయ చిత్రాలకు దూరంగా ఉంటూ వచ్చిన పలు అవకాశాలను తిరస్కరించిన ప్రియాంక.. చివరకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు ‘వారణాసి’ తప్ప మరో భారతీయ సినిమాను ఆమె ప్రకటించలేదు. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను వెల్లడించారు.

2016లో విడుదలైన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్’కు సీక్వెల్‌గా ‘వెంటిలేటర్ 2’ను ప్రకటించారు. ఈ సినిమాతో ప్రియాంక చోప్రాకు చెందిన నిర్మాణ సంస్థ ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్’ మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేష్ మపుస్కర్ ఈ సీక్వెల్‌కు కూడా రచయితగా, దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

అయితే ‘వెంటిలేటర్ 2’ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇది ఆమెకు సంబంధించిన నిర్మాణ బాధ్యత మాత్రమే. ప్రస్తుతం ఆమె ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రియాంక చోప్రా, ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా, రాజేష్ మపుస్కర్ కలిసి పర్పుల్ పెబుల్ పిక్చర్స్, మ్యాజిక్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2019లో విడుదలైన ‘ది స్కై ఈజ్ పింక్’ తర్వాత ప్రియాంక భారతీయ థియేటర్లలో విడుదలైన మరో సినిమాలో కనిపించలేదు.