STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 3:35 pm Posted by : ARUN

Azharuddin:మహ్మద్ షమీ రిటైర్మెంట్ బాధాకరం.. అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై తెలంగాణ మంత్రి, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. షమీ రిటైర్మెంట్ బాధాకరమైన విషయమని, అయితే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు. దేశం కోసం షమీ ఎంతో సేవ చేశారని ప్రశంసించారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్.. ఒక ఆటగాడు ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానులకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఆటగాళ్లు మైదానంలో ఆడటం చూసి అలవాటు పడిపోతామని అలాంటి వారు ఆటకు దూరమైనప్పుడు ఆ లోటు కనిపిస్తుందని చెప్పారు.

మహ్మద్ షమీ దాదాపు 13 ఏళ్లకు పైగా భారత క్రికెట్‌కు సేవలందించారని అజారుద్దీన్ గుర్తుచేశారు. ఈ కాలంలో దేశం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. షమీ రిటైర్మెంట్ నిర్ణయం తనకు బాధ కలిగించినప్పటికీ, ఆయన స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నందున దాన్ని గౌరవించాలని అన్నారు.

భారత క్రికెట్‌కు షమీ అందించిన సేవలు గొప్పవని పేర్కొన్న అజారుద్దీన్.. భవిష్యత్తులో ఆయనకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. షమీ దేశం తరఫున అద్భుతంగా ఆడారని ప్రశంసించారు.