తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తనకు బీజేపీ మద్దతు ఉందంటూ వస్తున్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తన జీవితాన్ని నడిపించేది దేవుడని, తన అభిమానులు, ప్రజలు తనకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు.
చెన్నైలో తన తాజా చిత్రం ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం: ది బ్లడ్ వుడ్’ ఆడియో వేడుకలో ధనుష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన గురించి అనేక రకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, కొందరు తన వెనుక ఉన్నారని, మరికొందరు తనకు మద్దతు ఇస్తున్నారని మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే తనకు దేవుడి మార్గదర్శకత్వం ఉందని అభిమానులు తనకు అండగా నిలుస్తున్నారని… ప్రజలు తనతో ఉన్నారని పేర్కొన్నారు.
ఇటీవల ధనుష్ అభిమాన సంఘాన్ని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ అనే సంక్షేమ సంస్థగా విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించడం వంటి పరిణామాలు ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలకు కారణమయ్యాయి. అంతేకాకుండా, ఓ కార్యక్రమంలో పంపిణీ చేసిన వెండి దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో బీజేపీతో సంబంధాలున్నాయనే ప్రచారం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలోనే తన జీవితాన్ని నడిపించేది దేవుడని చెప్పుకొచ్చారు.