STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 9:44 am Posted by : ARUN

IND vs SL: భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు.. ఢిల్లీకి బదులుగా విశాఖపట్నంలో!

భారత్, శ్రీలంక మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ వేదిక మారింది. తొలుత ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 13న జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి మారుస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చని, మరోవైపు స్టేడియంలో మరమ్మతులు, ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) బీసీసీఐకి తెలియజేసింది. దీంతో వేదికను మార్చాలని నిర్ణయించారు.

బీసీసీఐ ప్రకటన ప్రకారం.. డిసెంబర్ 13, 2026న జరగనున్న భారత్-శ్రీలంక తొలి వన్డే విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మార్పు DDCA చేసిన అభ్యర్థన మేరకు చేపట్టినట్లు బోర్డు వెల్లడించింది.

శ్రీలంకతో భారత జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. 2026 క్యాలెండర్ ఏడాదిలో భారత జట్టుకు ఇదే చివరి వన్డే సిరీస్ కానుంది. తొలి మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుండగా.. రెండో వన్డే బెంగళూరులో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆయన తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంకతో ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్ కోహ్లీకి సొంతగడ్డపై చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశం ఉండేది. అయితే వేదిక మారడంతో ఆ అవకాశాలు తగ్గాయి. 2027లో ఢిల్లీకి మరో వన్డే మ్యాచ్ ఆతిథ్యం ఇచ్చే అవకాశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

వన్డే సిరీస్ అనంతరం భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. రాజ్‌కోట్, కటక్, పుణె నగరాలు ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.