STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 10:05 am Posted by : ARUN

Green Crackers:గ్రీన్ క్రాకర్స్ నిజంగానే కాలుష్యాన్ని తగ్గిస్తాయా?

దేశ వ్యాప్తంగా పండుగ సందడి మొదలైంది. అయితే మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గాలి నాణ్యత ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, వినియోగానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? ఇవి నిజంగానే పర్యావరణానికి మేలు చేస్తాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

సంప్రదాయ బాణసంచాతో పోలిస్తే తక్కువ కాలుష్యం విడుదల చేసేలా CSIR-NEERI శాస్త్రవేత్తలు గ్రీన్ క్రాకర్స్‌ను అభివృద్ధి చేశారు. 2018లో వీటిని పరిచయం చేశారు. సంప్రదాయ బాణసంచాతో పోలిస్తే దాదాపు 30 శాతం వరకు ఉద్గారాలను తగ్గిస్తాయని చెబుతున్నారు.

సాధారణ బాణసంచాలో ఉండే బేరియం నైట్రేట్, అల్యూమినియం వంటి హానికర పదార్థాలను వీటిలో తగ్గించారు. వీటి స్థానంలో తక్కువ హానికరమైన ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. దుమ్ము, పొగ ఉద్గారాలను తగ్గించేందుకు ఐరన్ ఆక్సైడ్, జియోలైట్ వంటి పదార్థాలను వినియోగిస్తున్నారు.అలాగే బేరియం నైట్రేట్ స్థానంలో పొటాషియం నైట్రేట్ లేదా స్ట్రాంటియం లవణాలను ఉపయోగిస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించినప్పటికీ పూర్తిగా కాలుష్య రహితమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. వీటిని పెద్ద సంఖ్యలో ఉపయోగించినప్పుడు గాలిలోకి హానికరమైన కణాలు, వాయువులు విడుదలవుతాయని హెచ్చరిస్తున్నారు.

2026 నవంబర్ 2న జస్టిస్ ఎం.ఎం. సుంద్రేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. దీపావళి సందర్భంగా నవంబర్ 7, 8 తేదీల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతించింది.

అయితే వీటిని ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని స్పష్టం చేసింది. బాణసంచా కాల్చడం వల్ల గాలి, శబ్ద కాలుష్యంతో పాటు ఘన వ్యర్థాలు కూడా ఏర్పడతాయని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.