STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 2:17 pm Posted by : ARUN

Warangal Congress:వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ రాజిరెడ్డికి ఘన సన్మానం

వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అబ్బిడి రాజిరెడ్డికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అబ్బిడి రాజిరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పార్టీ నాయకులు, మండల, డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి సన్మానించడంతో పాటు నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ.. అబ్బిడి రాజిరెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా నియమితులు కావడం సంతోషకరమని అన్నారు. సహకార రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని, ముఖ్యంగా రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలు అందించడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

రాజిరెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, సహకార సంఘం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు. ప్రజలు, రైతులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ పదవి ఆయనకు మరిన్ని ప్రజాసేవా అవకాశాలను కల్పించాలని అభిలషించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, మండల అధ్యక్షులు పొశాల వెంకన్న, ఇస్లావత్ సావిత్రి, దాడి శివ, ఇండ్ల రవికుమార్, డివిజన్ అధ్యక్షులు జన్ను అరుణాకర్, సయ్యద్ ఇంతియాజ్, మాడుగుల రాజ్ కుమార్, అశోక్, మహమ్మద్ జానీ, పసునూరి శ్రవణ్,మన్నె బాబురావు, ఎల్గొండ ప్రవీణ్, గోదాసి చిన్న, కిన్నెర రవి, మంద సన్నీ, షేక్ దస్తగిరి తదితరులు హాజరై అబ్బిడి రాజిరెడ్డికి అభినందనలు తెలిపారు.