STAR TRINETHRAM
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 5:30 pm Posted by : ARUN

CM Revanth Reddy:కొడంగల్‌కు సీఎం రేవంత్..రూ.9,053 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల పాటు నవంబర్ 7, 8, 9 తేదీల్లో కొడంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,053 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి కీలక సూచనలు చేశారు.

తొలుత నవంబర్ 7న హకీంపేటలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను రైతులకు పరిచయం చేయడం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే ప్రత్యామ్నాయ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం సుమారు 150 ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిపుణులు రైతులకు సూచనలు ఇవ్వనున్నారు.

రైతు మేళా ప్రారంభోత్సవంలో భాగంగా వ్యవసాయ యూనిట్లు, పరికరాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, ఆధునిక యంత్రాలు, నూతన సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్‌పుట్ సెంటర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించనున్నారు.

పర్యటనలో భాగంగా రెండో రోజైన నవంబర్ 8న స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం రేవంత్. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం, ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే రూ.5,060 కోట్లతో కొత్వాల్‌గూడ-నాచారం రేడియల్ రోడ్డు-2, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ రెండో దశ పనులు, రూ.1,410 కోట్లతో 223 బీటీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కొడంగల్‌లో రూ.123 కోట్లతో నిర్మించనున్న వ్యవసాయ కళాశాల పనులను కూడా ప్రారంభించనున్నారు. రూ.118.80 కోట్లతో ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్ల నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన నవంబర్ 9న హకీంపేటలో నిర్వహించనున్న  రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సభకు సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.