అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలన్న రాజ్యాంగ నిబంధనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీసులు అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి కాకుండా.. ఒక వ్యక్తిని నిర్బంధించిన క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
గురువారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టు, నిర్బంధం మధ్య కృత్రిమమైన వ్యత్యాసాన్ని చూపించడానికి వీల్లేదని పేర్కొంది. అధికారిక అరెస్టుకు ముందు నిర్బంధించిన సమయాన్ని 24 గంటల గడువు లెక్కింపులో మినహాయించడానికి అనుమతించే ఏ విధానమైనా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
24 గంటల గడువును లెక్కించేటప్పుడు మినహాయించగల సమయం ఒక్కటేనని ధర్మాసనం తెలిపింది. అరెస్టు చేసిన ప్రదేశం నుంచి మెజిస్ట్రేట్ కోర్టుకు చేరుకోవడానికి సహేతుకంగా అవసరమైన ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించవచ్చని పేర్కొంది. అధికారిక అరెస్టుకు ముందు విచారణ, దర్యాప్తు, సోదాలు లేదా స్వాధీనం కోసం వెచ్చించిన సమయాన్ని మినహాయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టు చేసి నిర్బంధించిన ప్రతి వ్యక్తిని ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఈ నిబంధనను ఉల్లంఘించి 24 గంటలకు మించి నిర్బంధించిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ విషయంలో ఒడిశా హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, కేరళ హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ధర్మాసనం విభేదించింది. అరెస్టుకు ముందు నిర్బంధించిన సమయాన్ని కూడా గడువు లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.